Followers

Tuesday, December 3, 2019

మృగాళ్లను క్షమించరాదు






బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలపై ఉక్కుపాదం మోపుతామని, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రా క్ కోర్టులు ఏర్పాటు, దోషులకు కఠిన శిక్షలు ప డేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. శంషాబాద్‌కు చెందిన  వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై సిఎం కెసిఆర్ స్పందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హన్మకొండ మానస, హాజీపూర్ తదితర అత్యాచార కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.


దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సిఎం అధికారులను కోరారు. ఇటీవల వరంగల్లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడిందని సిఎం గుర్తుచేశారు. అదే తరహాలో మిగిలిన కేసులో కూడా సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని, మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అత్యాచార బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తుందని, బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సిఎం హామీ ఇచ్చారు.