Followers

Tuesday, December 3, 2019

ఆర్‌టిసి ఉద్యోగులు ఖుష్


ఆర్‌టిసి ఉద్యోగులు మంచి జోష్ మీద ఉన్నారు.. ఖుషిఖుషిగా సంబరాలు జరుపుకుంటున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం 55 రోజుల పాటు సమ్మె చేసిన కార్మికులకు ఊహించని వరాలు పొందారు. సిఎం కెసిఆర్‌తో ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సిఎం కెసిఆర్ వరాలు కురిపించారు. అంతేకాదు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌టిసి కార్మికులు కాదు ఆర్‌టిసి ఉద్యోగులమని పిలవాలన్నారు. యాజమాన్యం, ఉద్యోగులు వేరువేరుకాదు అందరూ ఒకే కుటుంబంలాగా వ్యవహరించాలని సిఎం స్పష్టం చేశారు. అన్నింటికంటే మిన్నగా ఆర్‌టిసి సిబ్బంది సమ్మె చేసిన 55 రోజులకు వేతనాలు చెల్లిస్తామన్న సిఎం ప్రకటనతో ఆ ప్రాంతమంతా కరతాళధ్వనులతో మారుమోగింది.


అసలు అడిగేందుకు కూడా సంశయించే అంశాన్ని సిఎం స్వయం ప్రస్తావించి వేతనాలు చెల్లిస్తామని వెల్లడించడంతో ఆనందంతో మైమరిచిపోయారు. సమ్మె కాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇస్తామన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. ఆర్‌టిసి సిబ్బందికి చెల్లించాల్సిన సెప్టెంబర్ జీతాన్ని డిసెంబర్ 2న చెల్లిస్తామని చెప్పారు. ఉద్యోగుల ఇంక్రిమెంట్ కూడా యధావిధిగా ఇస్తామన్నారు.


వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్‌లో ఆర్‌టిసికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని సిఎం చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. టికెట్ తీసుకునే బాధ్యత కూడా ప్రయాణికులపైనే ఉంటుందని.. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు ఉండవని తెలిపారు. ఉద్యోగుల తల్లిదండ్రులకు ఆర్‌టిసిలో ఆరోగ్య సేవలు, ఉచిత బస్‌పాస్‌లు కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు.


మహిళలకు రాత్రి 8 వరకే డ్యూటీలు…!

మహిళా ఉద్యోగులకు రాత్రి 8 వరకే డ్యూటీలు ఉంటా యి. అర్ధరాత్రులు డ్యూటీలు ఆర్‌టిసిలో ఉండవని సిఎం చెప్పారు. పతి డిపో లో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటుచేస్తామన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూ తి సెలవులతో పాటు మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తామని చెప్పారు. మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్‌లో రావాలనే నిబంధనలు ఇక ఉండవు. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు సిఎం కల్పించారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు సిఎం ఒప్పుకున్నారు.