ప్రియాంక హత్యాచారంపై ప్రపంచ వ్యాప్త నిరసనలు
మన తెలంగాణ/హైదరాబాద్: 'జస్టిస్ ఫర్ దిశ' ఉదంతంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. సినిమా, రాజకీయ రంగం స హా ఇతర రంగాల్లోని ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'జస్టిస్ ఫర్ దిశ' నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో 'జస్టిస్ ఫర్ దిశ' ఓ ఉద్యమంగా మారింది. బాధిత కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగానే కాదు.. విదేశీయులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ట్విటర్ ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నందునే భారతను సందర్శించాలంటే భయంగా ఉందని ఓ విదేశీ మహిళ చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తోంది.
భారత్ కు వెళ్లి ఇలాంటి దారుణాలకు బలై ఇక తిరిగి రాకపోవచ్చునేమో అని సందేహం వ్యక్తం చేసింది ఆ మహిళ. తాజా హత్యాచార ఘటనలో నిందితుల్ని సజీవ దహనం చేయాలంటూ ఇక్కడి ఆందోళనకారులతో తన స్వరాన్ని కలిపింది. మరోవైపు పోలాండ్ లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన బుడతడు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇలా బాధితురాలి హ్యాష్ టాగ్‌తో ట్విటర్ లో అనేక మంది తమ అభిప్రాయాన్ని, ఆవేదనను పంచుకుంటున్నారు. పలు అంతర్జాతీయ పత్రికల్లో సైతం 'జస్టిస్ ఫర్ దిషా' ఘటనను ప్రధానంగా ప్రచురించాయి.
బీబీసీ, గల్ఫ్ న్యూస్, డైలీ మెయిల్ వంటి ప్రముఖ సంస్థలు వార్తకు ప్రాధాన్యం ఇచ్చాయి. బాధుతురాలి కుటుంబసభ్యులు పోలీసుల్ని సంప్రదించినప్పుడు వారు ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిని ప్రధానంగా ప్రస్తావించాయి. ఇలాంటి ఘోరాల్ని నిరోధించేలా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశాయి. ఇటు దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు, ప్రజాసంఘాలు బాధితురాలి కుటుంబానికి సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 'జస్టిస్ ఫర్ దిషా' నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రచారంతో ప్రమాదం : సిపి సజ్జనార్
శంషాబాద్ హత్యాచార ఘటనలో బాధితురాలి వివరాలను ప్రచురించరాదని మీడియా సంస్థలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఇలాంటి అత్యంత హేయమైన సంఘటన వివరాలను పదేపదే ప్రసారం చేయడంతో ప్రజలు ప్రత్యేకించి మహిళలు వారి తల్లితండ్రుల్లో భయం నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మీడియా సంయమనం పాటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో తమతో కలిసి రావాలని, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పి వారికి మేమున్నామనే భరోసా ఇవ్వడంలో సహకరించాలని కోరారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇలాంటి ఘటనల్లో బాధితురాలి పేరు ఇతర వ్యక్తిగత వివరాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి దూరంగా ఉండాలని మీడియా సంస్ధలను కోరుతున్నామని చెప్పారు. బాధితురాలి వివరాలు వెల్లడికావడంతో బాధిత కుటుంబానికి వివిధ రూపాల్లో సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులు ఏం చేయాలనే విషయంలో వారిలో అవగాహన పెంచే అంశాలను ప్రసారం చేయాలని కోరారు.
పోస్టులపై.. పోలీసులు సీరియస్
సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఎవరైనా అసభ్యంగా పోస్టింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు అందగా వెంటనే కొన్ని అసభ్య ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలావుండగా జస్టిస్ ఫర్ ఉదంతం తర్వాత కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఆమెను కించపరుస్తూ అసభ్య పోస్టులు పెట్టి.. నిందితులకు మద్దతుగా పోస్టులు చేస్తూ మరికొందరు అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు. అయితే మరికొందరు నెటిజన్లు ఆ మద్దతు పలికిన వారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
ఆగని ఆందోళనలు
జస్టిస్ ఫర్ దిషా కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఆదివారం సాక్షాత్తూ చర్లపల్లి జైలు వద్దే యువకులు, ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి యువకులు, ప్రజలు బైక్ ర్యాలీగా చర్లపల్లి జైలు వద్దకు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. జైలు గేటు ముందు కూర్చొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో జైలు వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. శనివారం కూడా షాద్నగర్ పీఎస్ వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి నిందితులకు ఉరిశిక్ష వేయాల్సిందేనని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.