న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనలపై జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ స్పందించారు. నిరసన వ్యక్తం చేయడంలో సంయమనం పాటించాలని ఈ సందర్భంగా సూచించారు. అదే సమయంలో పౌరసత్వ చట్టంతో భారతీయ ముస్లింకు ఎటువంటి సంబంధంలేదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. జాతీయ పౌర రిజిస్టర్ అంశాన్ని కూడా ప్రస్తావించిన ఆయన.. ఇది ఇంకా చట్టం రూపం దాల్చలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బాంగ్లాదేశ్‌కు చెందిన ముస్లిం శరణార్థులనే ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రభావితం చేస్తుందంటూ ప్రస్తుత పరిస్థితులపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.
'నిరసన వ్యక్తం చేయడమనేది ఓ ప్రజాస్వామిక హక్కు. ఈ విషయంలో ఎవరూ అడ్డుపడకూడదు. అయితే.. నిరసన వ్యక్తం చేసే సమయంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇక.. పౌరసత్వం చట్టం, జాతీయ పౌర చట్టం.. అనేవి రెండు భిన్నమైన అంశాలు. పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా మారింది. అయితే జాతీయ పౌర రిజిస్టర్ గురించి ఓ ప్రకటన మాత్రమే వెలువడింది.' అని షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రధాన మసీదుల్లో జామా మసీద్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే.